ధరణి లో ఆస్తుల నమోదుకు గడువేం లేదు
ఎప్పుడైనా చేసుకోవచ్చు... ఇది నిరంతర ప్రక్రియ
‘ధరణి’లో వ్యక్తిగత సమాచారానికి భద్రత
హైకోర్టుకు స్పష్టం చేసిన రాష్ట్ర ప్రభుత్వం
ఆస్తుల నమోదుకు గడువేం లేదు
వ్యవసాయేతర ఆస్తుల వివరాలను ‘ధరణి’ పోర్టల్‌లో నమోదు చేసుకోవడానికి నిర్దిష్ట గడువు ఏదీ లేదని ప్రభుత్వం బుధవారం హైకోర్టుకు స్పష్టం చేసింది. ఎప్పుడైనా నమోదు చేసుకోవచ్చని, ఇది నిరంతర ప్రక్రియ అని పేర్కొంది. అంతేగాకుండా పోర్టల్‌లో నమోదు చేసే వ్యక్తిగత సమాచారానికి భద్రత ఉంటుందని హామీ ఇచ్చింది. ఎలాంటి చట్ట పరిధి లేకుండా ప్రభుత్వం ధరణిలో ఆస్తుల నమోదు ప్రక్రియ చేపట్టిందని... ఇది సరికాదని పేర్కొంటూ న్యాయవాది ఐ.గోపాల్‌శర్మ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. దీనిపై బుధవారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్.ఎస్.చౌహాన్, జస్టిస్ బి.విజయ్‌సేన్‌రెడ్డిలతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది డి.ప్రకాష్‌రెడ్డి వాదనలు వినిపించారు. ‘‘ధరణిలో ఆస్తుల నమోదుకు పత్రికల్లో ప్రకటన తప్ప ఏ చట్టం ప్రకారం, ఏ నిబంధనల ప్రకారం చేస్తున్నదీ ఎక్కడా లేదు. పైగా గడువు నిర్దేశించి ఆ సమయంలోగా ఈ ప్రక్రియ ముగించాలని ప్రభుత్వం పేర్కొంటోంది. వ్యక్తిగత వివరాలను కూడా సేకరిస్తోంది. వెబ్‌సైట్‌లో ఉంచే ఈ సమాచారానికి ఎలాంటి భద్రతా లేదు. ఆధార్‌తోపాటు కులం వివరాలను కూడా సేకరించి ఎవరైనా తెలుసుకునేలా బహిరంగంగా ఉంచుతోంది. సంక్షేమ పథకాల అమలులో భాగంగా మాత్రమే కులం వివరాలను సేకరించాలని సుప్రీంకోర్టు పుట్టుస్వామి కేసులో స్పష్టం చేసింది’’ అని ప్రకాష్‌రెడ్డి వివరించారు.
కులం వివరాలను సేకరిస్తే తప్పేంటి?
పిటిషనర్ వాదనలను విన్న ధర్మాసనం... కులం వివరాలను సేకరిస్తే తప్పేమిటని ప్రశ్నించింది. పాఠశాలలో చేరింది మొదలు కులం వివరాలు రికార్డులో నమోదవుతున్నాయన్న విషయాన్ని పరిగణనలోకి తీసుకోవాలంది. అంతేగాకుండా వ్యక్తిగత సమాచారానికి భద్రత కల్పిస్తామని ప్రభుత్వం చెబుతున్నప్పుడు అభ్యంతరాలేమిటని అడిగింది. అడ్వొకేట్ జనరల్ బి.ఎస్.ప్రసాద్ జోక్యం చేసుకుంటూ ఆస్తుల నమోదుకు ఎలాంటి గడువు లేదని తెలిపారు. ధర్మాసనం స్పందిస్తూ గతంలో ధరణిలో నమోదు ప్రక్రియకు గడువు ఉందని పత్రికల్లో కథనాలు వచ్చాయని, స్పష్టమైన ప్రభుత్వ వివరణతో రావాలంటూ విచారణను మధ్యాహ్నానికి వాయిదా వేసింది. అనంతరం మధ్యాహ్నం ఏజీ మాట్లాడుతూ ధరణిలో ఆస్తుల నమోదు ప్రక్రియ నిరంతర కార్యక్రమమని, వ్యక్తిగత సమాచారానికి భద్రత కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఈ హామీని నమోదు చేయాలంటూ పిటిషనర్ తరఫు న్యాయవాది అభ్యర్థించారు. దీనిని ధర్మాసనం ఆమోదిస్తూ ఏజీ హామీని నమోదు చేసింది. ప్రతివాదులైన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి, వివిధ శాఖల అధికారులకు, జీహెచ్‌ఎంసీకి నోటీసులు జారీ చేసింది. పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశిస్తూ విచారణను నవంబరు 3వ తేదీకి వాయిదా వేసింది.
0 Comments