తెలంగాణ ప్రభుత్వం కొత్త రెవెన్యూ చట్టం రూపొందించింది. అసెంబ్లీలో సీఎం కేసీఆర్ కొత్త రెవెన్యూ ముసాయిదా బిల్లును ప్రవేశపెట్టారు. 2020, సెప్టెంబర్ 09వ తేదీ తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు మూడో రోజు ఉదయం ప్రారంభమయ్యాయి.
రెవెన్యూ చట్టంపై సభలో చర్చ
ఈనెల 10, 11 తేదీల్లో కొత్త రెవెన్యూ చట్టంపై సభలో చర్చ జరుగనుంది. సులువుగా, పారదర్శకంగా ప్రజలకు రెవెన్యూ సేవలు అందించాలనే లక్ష్యంతో.. ప్రభుత్వం కొత్త రెవెన్యూ చట్టాన్ని రూపొందించింది. అక్రమాలకు తావులేకుండా, భూ లావాదేవీలు సులభంగా పూర్తవ్వాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ చట్టాన్ని తీసుకొచ్చింది.
రికార్డ్ ఆఫ్ రైట్ చట్టం-2020
ప్రస్తుతం తెలంగాణలో అమల్లో ఉన్న భూ యాజమాన్య హక్కుల చట్టానికి సవరణ చేస్తూ రికార్డ్ ఆఫ్ రైట్ చట్టం-2020ని అమల్లోకి తేనుంది. ఈ మేరకు అసెంబ్లీలో తెలంగాణ రైట్స్ ఇన్ ల్యాండ్ అండ్ పట్టాదార్ పాస్‌బుక్స్ బిల్-2020ను ప్రవేశపెట్టనుంది. వీఆర్‌ఓ వ్యవస్థ రద్దు చేస్తూ మంత్రివర్గం ఆమోదించిన బిల్లును కూడా సభలో ప్రవేశపెడతారు.
భూ నిర్వహణలో సరికొత్త మార్పులు
కొత్త చట్టం ద్వారా భూ నిర్వహణలో సరికొత్త మార్పులకు ప్రభుత్వం శ్రీకారం చుట్టనుంది. రెవెన్యూ శాఖలో చోటు చేసుకునే అవినీతిలో 90 శాతం మ్యుటేషన్, పట్టాదార్ పాస్‌పుస్తకాల జారీతోనే ముడిపడి ఉండటంతో.. దీనికి అడ్డుకట్ట వేస్తూ రికార్డ్ ఆఫ్ రైట్ చట్టంలోని కీలకమైన క్లాజులను మార్చుతూ ప్రభుత్వం ఈ బిల్లును రూపొందించింది.
నోటీసుల విధానానికే ఉద్వాసన
ఉమ్మడి రాష్ట్రంలో భూముల రిజిస్ట్రేషన్ జరగ్గానే.. ఆ భూముల లావాదేవీలు సరైనవేనా కాదా అని నిర్ధారించడానికి వీలుగా నోటీసులు జారీ చేసి.. 30 రోజుల గడువు అనంతరం మ్యుటేషన్ చేసేవారు. దీన్ని వారం రోజులకు కుదిస్తూ తెలంగాణ ప్రభుత్వం గతంలోనే ఆర్‌వోఆర్ యాక్ట్‌ను సవరించగా.. తాజాగా బిల్లులో అసలు నోటీసుల విధానానికే ఉద్వాసన పలికారు.
ఆటోమేటిక్‌గా మ్యుటేషన్
దీనికి ఆమోదం లభిస్తే.. వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్, మ్యుటేషన్ అంతా తహసీల్దార్ చూడనున్నారు. కొత్త చట్టం ద్వారా వ్యవసాయ భూ క్రయవిక్రయాల రిజిస్ట్రేషన్ పూర్తి కాగానే మ్యుటేషన్ వెంటనే పూర్తికానుంది. తెలంగాణ రాష్ట్ర సమగ్ర భూ దస్త్రాల నిర్వహణ విధానంలోని సమాచారం ఆధారంగా ఆటోమేటిక్‌గా మ్యుటేషన్ పూర్తికానుంది.
లావాదేవీ పూర్తికాగానే
2017లో భూ దస్త్రాల ప్రక్షాళన నిర్వహించడంతో దాని ఆధారంగా ఈ కొత్త విధానాన్ని రూపొందించారు. ఇప్పటికే ప్రభుత్వం రైతులకు డిజిటల్ పాస్ పుస్తకాలను అందజేసింది. రైతుల భూ దస్త్రాలకు ఆధార్ నంబర్లు, ఫోన్ నంబర్లను జతచేసింది. వాటి ఆధారంగా లావాదేవీ పూర్తికాగానే రైతు ఫోన్‌కు సంక్షిప్త సమాచారం అందే విధానాన్ని అందుబాటులోకి తెస్తోంది.
READ మారుతీరావు ఆత్మహత్యకు ముందు ఏం జరిగిందంటే?
తహసీల్దార్లకు వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్ అధికారాలు
ఇకపై ప్రభుత్వం తహసీల్దార్లకు వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్ అధికారాలను అప్పగిస్తోంది. కొత్త చట్టం ప్రకారం 592 తహసీల్దారు కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్ సేవలు ప్రారంభం కానున్నాయి. ఒకేచోట భూముల రిజిస్ట్రేషన్, మ్యుటేషన్ అందుబాటులోకి రానున్నాయి. వ్యవసాయేతర భూములకు మాత్రం ప్రస్తుతం ఉన్న సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాల్లోనే రిజిస్ట్రేషన్ చేస్తారు. సాంకేతికత ఆధారంగా రెవెన్యూ పరిపాలనను నిర్వహించేందుకు కొత్త చట్టం వీలు కల్పించనుంది.
రెవెన్యూ రికార్డుల్లోకి ఆటోమేటిక్‌గా పేరు
ఒక్కసారి రిజిస్ట్రేషన్ జరిగితే చాలు రెవెన్యూ రికార్డుల్లోకి ఆటోమేటిక్‌గా పేరు చేరనుంది. ఈ క్రమంలో రిజిస్ట్రేషన్ చేసే సమయంలో కొన్ని షరతులు విధించి.. ఈ ప్రక్రియ చేపట్టేలా కొత్త యాక్ట్‌ను అనుసరించి, చర్యలు తీసుకోనున్నారు. భూముల రిజిస్ట్రేషన్ జరిగి.. మ్యుటేషన్ కాగానే ఆ డేటా పట్టాదారు పాస్‌పుస్తకాల ముద్రణా కేంద్రానికి చేరనుంది.
భూముల యాజమాని లేదా రైతు ఇంటికే పాస్‌పుస్తకం
ఆ తర్వాత నేరుగా భూముల యాజమాని లేదా రైతు ఇంటికే పాస్‌పుస్తకం చేరుతుంది. దీనికోసం రైతుల నుంచి పోస్టల్ చార్జీల రూపేణా నిధులను ప్రత్యేకంగా వసూలు చేస్తారు. ఇక వారం రోజుల్లోపు పాస్‌పుస్తకం ఇంటికి రానుంది.
వీఆర్వోల వ్యవస్థ రద్దు
వీఆర్వోల వ్యవస్థను రద్దు చేయాలని నిర్ణయించిన ప్రభుత్వం.. తహసీల్దార్లు, ఆర్డీవోలు, అదనపు కలెక్టర్ల అధికారాలకూ కత్తెరపెడుతూ వీరు నిర్వహించే రెవెన్యూ కోర్టులను రద్దు చేయనుంది. ఈ మేరకు ఇవాల సభలో ప్రవేశపెట్టనున్న తెలంగాణ భూహక్కులు పాస్‌పుస్తకాల బిల్లు-2020లో రెవెన్యూ కోర్టుల స్థానంలో ట్రైబ్యునళ్లను ప్రతిపాదించింది.
కోర్టులన్నీ రద్దు
తహసీల్దార్లు, ఆర్‌వోఆర్, కౌలురక్షిత చట్టం, ఇనామ్ యాక్ట్, సీలింగ్ చట్టాల ద్వారా తహసీల్దార్ ఆర్‌వోఆర్ ఆధారంగా రెవెన్యూ కోర్టులు నిర్వహిస్తున్నారు. ఇకపై ఈ కోర్టులన్నీ రద్దు కానున్నాయి. తాజా బిల్లులో రెవెన్యూ కోర్టులు చూసే కేసులన్నీ ట్రైబ్యునళ్లు చూసుకునేలా క్లాజును చేర్చారు. తాజా నిర్ణయాలతో పలు జిల్లాల్లో రెవెన్యూ కోర్టులు దాదాపుగా ఆగిపోయాయి.
కోర్టులో సవాలు చేయడానికి వీల్లేకుండా చర్యలు
ప్రతి శనివారం కోర్టు కేసులకే యంత్రాంగం సమయాన్ని కేటాయించేది. దాంతో కొత్త చట్టంతో జిల్లాకు ఒక భూవివాదాల పరిష్కారానికి రెవెన్యూ ట్రైబ్యునల్ ఏర్పాటు చేయనున్నారు. బిల్లు చట్టరూపం దాల్చితే జిల్లా, రాష్ట్రస్థాయిలో ఈ ట్రైబ్యునళ్లు భూకేసుల విచారణను చేపట్టనున్నాయి. ట్రైబ్యునల్‌లో ఇచ్చేతీర్పును హైకోర్టు, సుప్రీంకోర్టులో తప్ప మరే కోర్టులో సవాలు చేయడానికి వీల్లేకుండా చర్యలు తీసుకోనున్నారు.